top of page
Writer's pictureVistaraku

Eenadu-Videshalaku Mana Vistarakulu



విస్తరాకులో భోజనం మన సంప్రదాయం. ఆరోగ్యదాయకం కూడా. కానీ కాలం మారింది, వేగం పెరిగింది. విస్తర్లు మాయమై ప్లాస్టిక్‌ ప్లేట్లు వచ్చాయి. వీటితో షడ్రుచులతోపాటే.. సర్వరోగాలూ శరీరంలోకి వెళ్తున్నాయి. ఆపైన పర్యావరణానికీ ముప్పే. ఈ సమస్యలకు పరిష్కారంగా పర్యావరణ హితమైన విస్తరాకుల వినియోగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు మాధవి. వాటిని దేశవిదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.

సిద్దిపేట జిల్లా ఎనుగుర్తి మాధవి సొంతూరు. అమ్మానాన్నల ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడటంతో అక్కడే డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆపైన బీఫార్మసీ పూర్తిచేశారు. భర్త విప్పులంచ వేణుగోపాల్‌ మెకానికల్‌ ఇంజినీర్‌. పెళ్లి తర్వాత మలేషియా, సింగపూర్‌, అమెరికాల్లో ఉండి.. 2007లో హైదరాబాద్‌కు తిరిగొచ్చింది వీరి కుటుంబం. వీరికి ఇద్దరబ్బాయిలు. సుజీత్‌, తన్మయ్‌. 2016లో సిద్దిపేట జిల్లా, తిమ్మారెడ్డిపల్లిలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు. వ్యవసాయ క్షేత్రంలో మామిడి, జామ, అరటి, బత్తాయి, పనస, సపోట, ఊసిరితోపాటు కొన్ని రకాల ఔషధ మొక్కలూ నాటారు. కూరగాయల్నీ పండిస్తున్నారు.



అలా విస్తర్లలోకి...

సేంద్రియ సాగు చేస్తున్న సమయంలోనే ఈమెకో సంఘటన ఎదురైంది. హైదరాబాద్‌లో ఓరోజు ఉదయపు నడకకు వెళ్లినపుడు గుట్టలుగా ప్లాస్టిక్‌ విస్తర్లూ, గ్లాసులూ పడి ఉన్నాయి. వాటితో అనారోగ్యం, పర్యావరణ కాలుష్యం... రెండు రకాలైన నష్టాలు. ఆ క్షణమే వాటికి ప్రత్యామ్నాయం తేవాలనుకుని సంప్రదాయ విస్తరాకుల తయారీ గురించి ఆలోచించారు. వాటి తయారీకి మోదుగ, అడ్డాకులు అవసరం. కానీ అవి అన్నిచోట్లా దొరకవు. తెలంగాణ అడవుల్లో మోదుగ ఆకులు దొరుకుతాయి. దాంతో ఆదిలాబాద్‌ అటవీ ప్రాంత గిరిజన మహిళలతో వాటిని సేకరించి పంపేలా ఒప్పందం కుదుర్చుకున్నారు మాధవి. అవి చాలా తక్కువగా రావడంతో ఒడిశా నుంచి అడ్డాకులు తెప్పించుకుంటున్నారు. 2020 ఫిబ్రవరిలో ‘విస్తరాకు’ పేరుతో సంస్థని ప్రారంభించారు. తమ వ్యవసాయ క్షేత్రంలో తయారీ యూనిట్‌ తెరిచారు. ప్రారంభంలో చేతులతో విస్తరాకులను కుట్టించేవారు. అంతలోనే కొవిడ్‌ రావడంతో అమ్మకాలకు బ్రేక్‌ పడింది. లాక్‌డౌన్‌ తర్వాత అడపాదడపా ఆర్డర్లు వచ్చేవి. ఫేస్‌బుక్‌లో, వెబ్‌సైట్‌ ద్వారా ప్రచారం చేస్తూ అమ్మకాల్ని చేపడుతున్నారు. 2020 చివర్లో అమెరికా నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్‌ రావడం తమ వ్యాపారంలో కీలక మలుపని చెబుతారు మాధవి.


ప్యాకింగ్‌కూ సరిపడేలా..

ప్రస్తుతం పదివేల విస్తరాకుల సామర్థ్యంతో యంత్రాల్ని ఏర్పాటుచేసి 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. భోజనం, అల్పాహారం, ప్రసాదాలూ, పానీపూరీకి సరిపడేలా ప్లేట్లూ, కప్పులూ తయారుచేస్తున్నారు. ప్రొడక్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, డిజైనింగ్‌లో ఫ్రాన్స్‌లో మాస్టర్స్‌ చేసిన వీళ్లబ్బాయి తన్మయ్‌... కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి మరీ ‘విస్తరాకు’ పరిశోధన, అభివృద్ధి విభాగానికి సారథ్యం వహిస్తున్నాడు. మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టుగా ఆహార పదార్థాల ప్యాకింగ్‌ కోసమూ ఇటీవల కొత్త ఉత్పత్తుల్ని డిజైన్‌ చేశాడు తన్మయ్‌. బిర్యానీ, మిఠాయిల ప్యాకింగ్‌కు వీలుగా చేసిన కేజీ, అరకేజీ డబ్బాలూ ఆ కోవకే చెందుతాయి. పర్యావరణ హితమైన గ్లాసులూ, స్పూన్లనీ మార్కెట్‌ చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.30 లక్షలు టర్నోవర్‌ సాధించగా ఈ ఏడాది అది రెట్టింపు చేస్తామంటారు మాధవి. క్యాటరింగ్‌ సంస్థలూ, సూపర్‌ మార్కెట్ల నుంచి వీరికి ప్రధానంగా ఆర్డర్లు వస్తున్నాయి. జర్మనీ, హాంకాంగ్‌, అమెరికాకూ వీరి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మున్ముందు వరి గడ్డి, ఎండిన అరటి ఆకుల్ని వినియోగించి ఉత్పత్తులు తేవాలనుకుంటున్నారు. ‘ఆకుల్ని వివిధ పరిమాణాల్లో కత్తిరించడంవల్ల వృథా ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గిస్తేనే లాభదాయకం. విదేశాలకు ఎగుమతులంటే నాణ్యతలోనూ రాజీ ఉండకూడదు. అందుకే ఆ రెండు విషయాల్నీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తా’నంటారు మాధవి. భవిష్యత్తులో తమ వ్యవసాయ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, అక్కడే ఓ రెస్టారెంట్‌నీ ప్రారంభించి సేంద్రియ విధానంలో పండించిన ఆహార ఉత్పత్తుల వంటకాల్ని అందిస్తామంటారు మాధవి.


‘ఆరోగ్యకర జీవన విధానానికి ప్రతి ఒక్కరూ శ్రేష్ఠమైన ఆహారం తీసుకోవడంతోపాటు పర్యావరణం, పరిసరాల గురించీ ఆలోచించాలి. ఓ మంచి మార్గంలో వెళ్తూ, పదిమందికి ఉపాధి కల్పిస్తున్నప్పుడు నిజమైన తృప్తి దొరుకుతుంది. భవిష్యత్తులో క్లాత్‌బ్యాగ్‌లూ, ఆవు పేడతో దీపాల తయారీనీ ప్రారంభిస్తా. కనీసం వంద మంది మహిళలకు ఉపాధి కల్పించాలన్నది నా లక్ష్యం’.

-నీల శ్రీహరి, కొండపాక











64 views0 comments

Recent Posts

See All

コメント


bottom of page